శిశిరం
పిట్ట కథ - 6
దీనికి మునుపటి కథ హేమంతం ఇక్కడ చదవండి
నిండు పున్నమి రాత్రి…
ఊరంతా సద్దుమణిగి పక్షులన్నీ గూళ్ళకి చేరాక నిద్రలేస్తాడు శల్యకుడు. అడవిలో ఉన్న అతిపెద్ద బాదాంచెట్టు తొఱ్ఱలో తన బస ఏర్పాటు చేసుకుని కొంత కాలమే అవుతోంది. రాత్రంతా మేత కోసం వెతుకుతూ తనదే రాజ్యంగా తిరుగుతాడు. ఏదైనా హాని జరగబోతోంది అనిపిస్తే మాత్రం తన శరీరాన్ని అంతా విదిలించి శూలాల్లాంటి ముళ్ళతో దాడి చేస్తాడు.
ఒళ్ళంతా ముళ్ళు, పైగా నిశాచరి, ఇలాంటి జీవికి కొత్త ప్రాణి కనబడింది అంటే కంగారు. తన ఆకారాన్ని చూసి అందరూ భయపడటమే కాని స్నేహంగా పలకరించే వారు లేరు. మిత్రులతో కలిసి కాలక్షేపం చేద్దామని ఉన్నా కూడా, ఇలా అర్థరాత్రి అపరాత్రి తిండి కోసం పాట్లుపడుతూ తెల్లారేసరికి తొఱ్ఱలో దూరి నిద్రపోతూ ఉంటాడు, ఇక స్నేహం చేసే అవకాశం ఎక్కడిది?
ఆ పౌర్ణమి రాత్రి కూడా హడావిడిగా అడవంతా గాలిస్తున్నాడు. శరీరమంతా ముళ్ళుండడంతో రకరకాల ఆకులు కాయలు వాటికి అంటుకుపోయి ఒక చోట నుండి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అలా ఒక బంగారు రంగు ఆకు తార ఉంటున్న ప్రదేశంలో పడింది.
తెలతెలవారుతుండగా తార నిద్ర లేచి మసకబారిన కళ్ళతో చుట్టూ చూసింది. రాలిన ఆకుల మధ్య సువర్ణ వర్ణంతో ధగధగా మెరుస్తున్న పెద్ద ఆకు ఒకటి కనబడింది. అద్భుతంగా ఉన్న దాన్ని చూస్తూ అందుకుందామని అటువైపు ఓ అడుగేసింది, కిలకిలమంటూ ఖగుడు వచ్చి వాలాడు. ఖగుడు కూడా అంతటి దట్టమైన బంగారురంగు ఆకును మునుపెన్నడూ చూసి ఎరుగడు. ఇంతలో బకుళ ఎగురుతూ వచ్చి వీరిని పలకరించింది. మెరుస్తూ ఆకర్షితంగా ఉన్న ఆ ఆకుని తీసి తన తల మీద కరీటంలా అలంకరించుకుంది.
"బకుళ! ముందు నేను చూశాను అది నాది!"
"హ...హ... నేనెంచక్కా అడవంతా తిరుగుతా, ఈ చెట్టు కిందే ఉండే నీకెందుకు?!"
"అంత బడాయికి పోకు బకుళ! తార ఆకుని తనకు తిరిగిచ్చేసెయ్యి!"
"హుం! ఇది నా తల మీద ఎంత బావుందో కాలువ నీటిలో చూసుకుని వస్తా!"
గాలిలో తేలిపోతున్నట్టుగా ఎగురుతూ బకుళ అక్కడినుంచి జారుకుంది. కొంగ ప్రవర్తనకి ఖంగుతిన్న తారా ఇంకా ఖగుడు చూస్తూ ఉండిపోయారు.
ఆ బంగారు ఆకు ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెడతానని ఖగుడు కూడా ఎగిరిపోయాడు తార మాత్రం ఎప్పటిలాగే చింతచెట్టు చుట్టుపక్కల తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని మెల్లగా కదులుతూ రాలిన ఆకులని వెతకసాగింది. అక్కడ ఊదారంగు లో కోడిగుడ్డు ఆకారంలో ఉన్న కాయ ఒకటి కనబడింది, మహదానందంగా తార దాన్ని కొరికింది. ఇదివరకు ఎప్పుడూ బాదంకాయలు తినని తారకి ఆ కాయ తియ్యగా పుల్లగా చాలా రుచిగా తోచింది.
కొద్ది ఘడియలు గడిచి, వాతావరణం కాస్త వెచ్చబడ్డాక ఖగుడు తిరిగి తార దగ్గరికి వచ్చి వాలాడు.
"బంగారు ఆకులు గల చెట్టు ఎక్కడా కనబడలేదు తారా ప్చ్!" అన్నాడు నీరసంగా.
"ఇదిగో ఇది తిని చూడు పండు ఎంత బాగుందో!" కొంచెం మిగిలిపోయిన బాదంకాయని అందించింది తార.
"ఆహా ఇంత రుచిగా తిని ఎంతకాలం అయిందో," ఆస్వాదిస్తూ అన్నాడు ఖగుడు.
ఇంతలో శశక అనే కుందేలు గెంతుతూ వచ్చి వీళ్ళున్న ప్రదేశం అంతా కలయ తిరిగింది. "కుందేలు పిల్ల ఏంటి వెతుకుతున్నావు?"
"నా బాదంకాయ ఎక్కడో పారేసుకున్నాను నువ్వేమైనా చూశావా?"
"ఎలా ఉంటుంది ఏంటీ కాయ?"
"కోలగా, గుండ్రంగా, ఎర్రటి రంగులో ఉంటుంది."
"అయ్యయ్యో నీదని తెలీక ఇప్పుడే తినేసామే!" నాలుక్కరుచుకుంది తార.
"ఆ!" శశక కొంత నిరాశ పడ్డా, "పోన్లే దాని విత్తనమైనా మిగిలిందా?"
"కొరకడం చేతకాక ఇక్కడే పడేసాము" ఇదిగో చూపించాడు ఖగుడు.
శశక హుషారుగా ఆ విత్తనం పట్టుకుని వెళ్ళిపోయింది.
మళ్లీ చీకటి పడ్డాక శల్యకుడు నిద్రలేచి అడవంతా తిరగసాగాడు. బాగా చలి పెరగడంతో అక్కడి చెట్లు ఆకురాల్చగా వాటి కొమ్మల మధ్య నుండి ఆకాశంలో పూర్ణ చంద్రుడు వెలిగిపోతున్నాడు. నేల రాలిన ఆకులు గాలికి సన్నని హోరుతో కదులుతున్నాయి. తను తిరిగిన ప్రదేశాలు అన్నీ చిందరవందర చేసి చివరికి బాదాంచెట్టు దగ్గరికి వచ్చి, బడలికతో కళ్ళు మూతలు పడిపోతూండగా తొఱ్ఱలోకి దూరిపోయాడు శల్యకుడు.
మరుసటి ఉదయం, వేప చెట్టు కింద రాలిన ఆకుల మోపు కదులుతోంది, ఆ మోపులోంచి ఎల్క కిచకిచమంటూ బయటపడింది.
"ఓష్!" అని గట్టిగా శ్వాస వదిలి తార తనని తాను సమర్థించుకుని "నువ్వే నా ఎల్కా? భలే బెదర కొడతావే!"
"ఇదిగో ఆకుల మధ్య దాక్కుంటే తప్ప ముప్పు తప్పదు… తప్పదు…" తనలో తాను గొణుక్కుంటోంది ఎల్క.
"ఏంటి ముప్పంటున్నావ్ ఏం ముంచుకొస్తోంది?"
"అమ్మో నాకేం తెలీదు, ఊహూ..." అంటూ తల అడ్డంగా ఊపుతూ ఎల్క హడావిడిగా తనతో పాటు వీలైనన్ని ఆకలని లాక్కుంటూ తన కలుగుని కప్పి పెట్టే ప్రయత్నం చేస్తోంది.
తార వెన్నులో వణుకు పుట్టింది రాత్రి తను పీడకలగా అనుకున్నది నిజమేనేమోనని శంక పుట్టింది. అలా ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తున్న తారకి బకుళ వచ్చిన విషయమే తెలియలేదు.
"హహహాహా..." బకుళ కీచు గొంతు విని అటుగా చూసింది తార.
"తారా బంగారు ఆకు ఎంత బాగుందో ఇంకొకటి దొరికిందా?"
"దాన్ని వెతికే ప్రయత్నం చేయకు బకుళ, నిన్న రాత్రి...నిన్న రాత్రి..." అంటూ గుటకలు మింగింది.
"ఆ… నిన్న రాత్రి?"
"అమ్మో నన్ను అడక్కు, ఎల్క కూడా ముప్పు అంటోంది సంగతి ఏంటో తననే అడుగు," ఆందోళనగా అంది.
సాయం సమయానికి స్నేహితులంతా చింత చెట్టు దగ్గర కాపు కాశారు.
వేప చెట్టు మీద రాజు, చింత చెట్టు గూటి లో ఖగుడు, ఆకులతో కప్పబడిన తన కలుగు కన్నంలోంచి చూస్తూ ఎల్క, కొంతదూరంలో బకుళ. నిశ్చలంగా ఉండి అన్ని దిక్కులూ చూస్తున్నారు. తార భయపడుతున్నట్టు ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ.
చంద్రోదయం అయిన కొన్ని ఘడియలకి కునికిపాట్లు పడుతున్న ఎల్కకి ఎవరో తన కలుగు దాటి రివ్వున వెళ్ళినట్టు అనిపించి మెలకువ వచ్చింది, చటుక్కున వెళ్లి తారని నిద్రలేపింది, "అదిగో చూశావా?"
వీళ్ళ అలికిడికి మెలుకువ వచ్చిన ఖగుడు కూడా అటు ఇటు చూసి వేపచెట్టు కింద ఉన్న ఆకారాన్నిగుర్తించాడు, వీలైనంత నిశ్శబ్దంగా ఎగిరి వెళ్లి రాజుని నిద్రలేపాడు. రాజు అతి జాగ్రత్తగా తొంగిచూసి ఆకు కదిలించకుండా నేలకి అతి దగ్గరగా ఉన్న వేపకొమ్మ మీదనుంచి కింద ఉన్న ఆకారాన్ని చూశాడు. వీళ్ళ సంకేతాలకి అప్రమత్త పడిన బకుళ కూడా ఇంకో వైపు నుండి వచ్చింది.
వీరందరూ ఆ ఆకారాన్ని చుట్టుముట్టగా శల్యకుడు అదిరిపడి "ఆ!" అంటూ ఒళ్ళువిదిలించబోయాడు. దూరంనుండి ఇదంతా గమనించిన ఉలూక అనే గుడ్లగూబ ఒక్క ఉదుటున శల్యకుడి ముందు వాలి, "ఊరుకో శల్యకా!" అంది మంద్రమైన గొంతుకతో. భయంతో కంపిస్తూ ఒళ్ళంతా బిగపట్టేసాడు శల్యకుడు.
సూర్యుడుదయిస్తుండగా శల్యకుడు, ఉలూక వచ్చి తారని నిద్ర లేపుతున్నారు. కొన్ని బాదాంకాయలు, ఆకులు తీసుకొచ్చాడు శల్యకుడు.
"శుభోదయం!" కిలకిలమంటూ ఖగుడు వచ్చి పలకరించాడు.
బకుళ కూడా హుషారుగా వచ్చింది, వీరిని పలకరించి శల్యకుడు తెచ్చిన రంగురంగుల ఆకులను తీసుకుని అలంకరించుకుంది. కొండ మీద ఉన్న గుళ్లోంచి కొబ్బరి కుడకలు తీసుకొని వచ్చాడు రాజు.
రాత్రి జరిగిన వింతలు విశేషాలను మిగితా స్నేహితులతో పంచుకున్నారు శల్యకుడు మరియు ఉలూక. తన చిరకాల వాంఛ తీరడంతో ఆనందంగా బాదాంచెట్టు తొఱ్ఱలోకి వెళ్ళి పోయాడు శల్యకుడు.








