దీనికి మునుపటి కథ వేసవి కాలం ఇక్కడ చదవండి
వర్షాకాలం... ఎడ తెఱపి లేకుండా వర్షం కురుస్తోంది...
నల్లటి మబ్బులతో నిండిన ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసి ఉరుము ఉరిమింది. గుండె దడ పుట్టించే శబ్దంతో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లాయి. తన కలుగు లోంచి తొంగి చూస్తున్న ఎల్క గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది.
కొట్టుకొస్తున్న ప్రవాహంతో చాలాసేపు పోరాడిన తార, ఇక ఓపిక నశించి కాళ్ళు చేతులు ఎత్తేసింది. వేగం పెరిగిన ప్రవాహంలో ఈదుతూ వెళ్ళి వేప చెట్టు మొదలు దగ్గర ఆగిపోయింది.
అది పగలో రాత్రో తెలియనంత చీకటి గా ఉంది. పక్షులన్నీ కలవరపడుతూ కేకలు వేస్తున్నాయి. ఖగుడు కూడా వణికిపోతూ చింత చెట్టు కొమ్మల్లో కూర్చున్నాడు.
కట్టలు తెంచుకున్న కాలువలో నీరు పైపైకి పొంగుతుంటే, బకుళ అనే కొంగ మాత్రం ఉత్సాహంగా చేపలు పట్టే పనిలో ఉన్నది.
కాలువ గట్టుకి కాస్త దూరంలో ఉన్న పొడుగాటి కొబ్బరి చెట్టును చీరేస్తూ మెరుపు ఒకటి తగిలింది. హుషారుగా చేపలు పడుతున్న బకుళ ఆ వెలుగుకి కళ్ళు మూసేసుకుని నీటిలో తల పెట్టింది. ఇంతలో పెద్ద శబ్దంతో ఉరుము దద్దరిల్లిపోయింది. చుట్టుపక్కల ఉన్న జంతువులు భయంతో వణికిపోయాయి.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఖగుడు, తారని వెతుక్కుంటూ బయల్దేరాడు. వేప చెట్టు మొదలు దగ్గర తారని చూసి అదే చెట్టు కొమ్మల్లో ముడుచుకుని కూర్చున్నాడు. ఇంతలో బీభత్సంగా అరుస్తూ బకుళ పరుగులెడుతూ అడవిలోకి వచ్చింది. సంగతి తెలుసుకుందామని ఖగుడు, బకుళ దగ్గరికి వచ్చి, "కంగారు పడకు బకుళ, ఏమైంది?" అని అడిగాడు. దానికి బకుళ అంతే భయంగా, "వెలుగు, శబ్దం... వెలుగు..." అంటూ మాటలు రాక తడబడసాగింది.
పక్కనే వరద నీటిలో తేలిపోతున్నట్టుగా ఉన్న తార కూడా బకుళ కి ధైర్యం చెప్పింది. ముగ్గురూ ఒకరికి ఒకరు తోడుగా ఆ గండం నుండి ఎప్పుడు బయటపడతామా అనే ఆతృతతో అలాగే తడిసిపోతూ నిద్రపోయారు.
నానా బీభత్సం చేసిన ఆ వర్షం తెల్లారేసరికి తెఱపినిచ్చింది. కారు మబ్బులు వీడి ఆకాశం లో ఉదయపు కాంతులు విరిసాయి. వర్షపు నీరు ఇంకి భూమి అంతా అలికిన ముంగిలిలా ఉంది. పక్షుల కిలకిలలు సుప్రభాతం పలుకుతున్నాయి.
బకుళ, తార, ఖగుడు కూడా నిద్రలేచి రాత్రి పిడుగు పాటు భయం నుంచి తేరుకుని మెల్లగా కాలువ గట్టుకు బయల్దేరారు...
పిట్ట కథ - Episode 3 podcast ఇక్కడ వినండి