ఒకానొక వసంత కాలం, సూర్యాస్తమయం తరువాత... ఏకాదశి వెన్నెల తో ఆకాశం వెలుగుతోంది...
గాబరాగా ఒక చిన్న పిచ్చుక దారి తప్పినట్లుగా అటూ ఇటూ ఎగురుతోంది. అలసిపోయి నేల మీద వాలి దిక్కులు చుస్తూ నడవసాగింది. ఇంతలో ఒక బండ రాయికి తగులుకుని ఖంగుతిని పక్కకు వెళ్ళబోయింది. అంతే! బండరాయి లో నుంచి మందంగా పెద్ద కళ్ళతో పాము ఒకటి తొంగి చూసింది.
"అయ్య బాబోయ్ పాము! పాము!" అని గట్టిగా కేకలు వెస్తూ అమాంతం పైకెగిరి దడగా రెక్కలు రెపరెపలాడించింది.
ఆ రాతి లోంచి బయటకి వచ్చిన జంతువు కూడా అదిరిపడి, "అమ్మో పాము రోయ్!" అని గబుక్కున దాక్కుంది.
ఒక క్షణం తరువాత తెలుసుకుంది, ఆ పిట్ట తనను చూసి పాము అనుకుందని. కాస్త ధైర్యం తెచ్చుకుని తన రాయి లాంటి డిప్పలోంచి బయటకి వచ్చి అటు ఇటు చూసిన తరువాత, జీరబోయిన గొంతుతో, "పామేమో అని హడలి పోయా! ఓష్ నేను పామును కాదు, తాబేలును. కుదుట పడి కిందకి రా పిట్టా! అయినా చీకటి పడ్డాక గూట్లో ఉండక ఈ అడవి లో ఉన్నావేం?" అని ప్రశ్నించింది.
పిచ్చుక హమ్మయ్య అని మనసులో అనుకుని పైకి మాత్రం కిలకిలా నవ్వతూ, "నేనేం భయపడలేదు, నువ్వు తాబేలువని తెలుసులే." అంటూ తాబేలు పక్కన వాలింది.
ఇలా విచిత్రంగా కలిసారు తార అనే తాబేలు, ఖగుడనే పిచ్చుక. ఆ రోజు తన ఇంటి దారి తప్పాడు ఖగుడు.
విచిత్ర పరిచయం podcast ఇక్కడ వినండి
తరువాయి కథ వేసవి కాలం ఇక్కడ చదవండి