మొదటి కథ వసంత కాలం ఇక్కడ చదవండి
ఎండా కాలం... మిట్టమధ్యాహ్నం...
వేడి గాలికి అడవి లో చెట్లు కూడా చిరాకుగా ఊగుతున్నాయి. చింత చెట్టు కింద తన డిప్పలో ముడుచుకుపోయి నిద్ర పట్టక విసుగ్గా ఉంది తార. ఖగుడెప్పుడు వస్తాడా వార్త ఎప్పుడు తెస్తాడా అని అప్పుడప్పుడూ ఆకాశం వైపు చూస్తోంది.
ఎండి రాలిన ఆకులు చిటపటలాడితే అటు పక్కకి ఆశగా చూసింది తార, ఏ పండిన చింతకాయో పడితే వెళ్ళి తిందామని. అసలే బద్ధకం, అందులో ఒక చుక్క వాన లేదు, పచ్చ గడ్డి కానీ వాటి పూలు కానీ లేవు తిందామంటే. అప్పుడప్పుడూ రాలుతున్న చిక్కిన చింతాకు ను నములుతూ కాలం గడుపుతోంది. ఇలా ఆలోచిస్తూండగా, కిచ కిచ మంటూ కంగారుగా ఎల్క అనే చిట్టెలుక అక్కడికి వచ్చింది.
"ఏంటి ఎల్కా ఇలా వచ్చావు?" అడిగింది తార.
ఎంత కంగారుగా వచ్చిందో అంతే హడావిడిగా పరిగెడుతూ, "వస్తోంది, వచ్చేస్తోంది!" అని గొణుగుతూ తన కలుగులోకి దూరిపోయింది ఎల్క.
"ఈ చిట్టెలుక ఏనాడు నిదానంగా పలకరించింది గనుక," అని మనసులో అనుకుని, పైకి మాత్రం, "ఆమ్మో ఏ నక్కో దారి తప్పి ఇటు వస్తోందేమో!" అని గుబులుగా తన డిప్ప లోకి దూరిపోయి కళ్ళప్పగించింది.
అలా ఎంత సేపు గడిచిపొయిందో... నడినెత్తిన పగలబడి నవ్విన సూర్యుడు నిట్టూరుస్తూ పశ్చిమ దారి పట్టాడు. పక్షులన్నీ తమ గూళ్ళకి చేరే పనిలో ఉన్నాయి.
కొంతకాలం కిందట పట్నం లో ఉన్న తన గూటి దారి మరచిన ఖగుడు, ఎప్పటిలాగే ఆ రోజు కూడా తన ఇంటిని వెతుక్కుంటూ పగలంతా తిరిగి సాయంత్రానికి తార ఉంటున్న చింత చెట్టు మీద వాలాడు.
ఇహ ఆ ఎల్క చెప్పిన ఎవరో రారని కుదుట పడ్డ తార, "ఖగా! వచ్చేసావా? ఏది దొరికిందా?" అని కేకేసింది.
ఖగుడు రివ్వున కిందకి వచ్చి నిస్సారంగా, "లేదు తారా, నా ఇల్లు దొరకలేదు, ఒక్క మబ్బు కనపడలేదు, ప్చ్!" అన్నాడు.
వెంటనే హుషారుగా, "కానీ ఆ చివార్న ఉన్న ఇంటి పెరట్లో మాత్రం జామ చెట్టు విరగ్గాసింది, ఇదిగో!" అంటూ కాస్త కొరికిన జామ పండుని తార ముందు పడేసాడు.
ఇద్దరూ ఆవురావురుమంటూ తియ్యని పండుని తిన్నారు.
ఇంతలో చల్లని గాలి వీచి అక్కడున్న చెట్లు నవ్వుతున్నట్టుగా అనిపించింది. అప్పుడర్థమయ్యింది తార కి ఆ ఎల్క చెప్పినట్లు వస్తున్నది ఊరటనిచ్చే వేసవి కాల వర్షమనీ!
పిట్ట కథ - Episode 2 podcast ఇక్కడ వినండి
Is there an english translation to this story?